Srimad Valmiki Ramayanam

Balakanda Sarga 58

Story of Trisanku !!

|| om tat sat ||

బాలకాండ
ఎబది ఎనిమిదవ సర్గము
త్రిశంకుని కథ

తతః త్రిశంకోర్వచనం శ్రుత్వా క్రోథ సమన్వితమ్ |
ఋషిపుత్ర శతం రామ రాజానం ఇదం అబ్రవీత్ ||

స|| హే రామ ! తతః శతం ఋషిపుత్త్రః త్రిశంకోః వచనం శ్రుత్వా క్రోథ సమన్వితం రాజానం ఇదం అబ్రవీత్ |
తా|| ఓ రామా! అప్పుడు ఆ వందమంది ఋషి పుత్రులు త్రిశంకుని మాటలను విని క్రోధముతో కూడినవారై ఇట్లు పలికితిరి

ప్రత్యాఖ్యాతోహి దుర్బుద్ధే గురుణా సత్యవాదినా |
కథం సమతిక్రమ్య శాఖాంతరముపేయవాన్ ||

స|| హే దుర్బుద్ధే !సత్యవాదినా గురుణా ప్రత్యాఖ్యాతో హి కథం తం సమతిక్రమ్య శాఖాంతరమ్ ఉపేయవాన్ |
తా|| ఓ దుర్బుద్ధీ ! సత్యమునే పలుకు గురువు చేత తిరస్కరించబడిన నీవు మేము ఎట్లు మాశాఖను దాటగలమనుకొంటివి.

ఇక్ష్వాకూణాం హి సర్వేషాం పురోధాః పరమో గురుః |
న చ అతిక్రమితుం శక్యం వచనం సత్య వాదినః ||

స|| సర్వేషాం ఇక్ష్వాకూణాం సత్యవాదినః పురోధాః పరమో గురుః | తం సత్యవాదినః అతిక్రమితుం న శక్యం చ ||
తా|| ఇక్ష్వాకు లందరికి సత్యము పలుకు పురోహితుడే పరమ గురువు. ఆ సత్యవాదిని మాట దాటటం అశక్యమైన పని ||

అశక్యమితి చ ఉవాచ వసిష్ఠః భగవాన్ ఋషిః |
తం వయం వై సమాహర్తుం క్రతుం శక్తాః కథం తవ ||

స|| భగవాన్ ఋషిః వసిష్ఠః తం అశక్యమితి ఉవాచ | తవ క్రతుం సమాహర్తుం కథం వై వయం శక్తాః ||
తా|| భగవాన్ ఋషి వసిష్ఠుడు నీ కోరికను అశక్యమని చెప్పినాడు. ( అప్పుడు) నీ క్రతువును చేయుటకు మాకు ఏట్లు శక్తి కలుగును.

బాలిశస్త్వం నరశ్రేష్ఠ గమ్యతాం స్వపురం పునః |
యాజనే భగవాన్ శక్తః త్రైలోక్యస్యాపి పార్థివ |
అవమానం చ తత్కర్తుం తస్య శక్ష్యామహే కథమ్||

స|| హే నరశ్రేష్ఠ ! త్వం బాలిశః | స్వపురః పునః గమ్యతామ్ | హే పార్థివ భగవాన్ యాజనే త్రైలోకస్యాపి శక్తః | తత్కర్తుం తస్య అవమానంచ శక్ష్యామహే కథమ్ |

తా|| ఓ నరశ్రేష్ఠా ! నీవు మూర్ఖుడవు. నీ పురమునకు వెళ్ళిపొమ్ము. ఓ రాజా ! ఆ మహాముని యజనము చేయించుటకు ముల్లోకములలో శక్తి కలవాడు. దానిని (నీ కోరికతీరు యజ్ఞమును) చేయుట అ మహామునిని అవమానము చేసినట్లు. అట్టిపని ఎట్లు చేయగలము !

తేషాం తద్వచనం శ్రుత్వా క్రోథ పర్యాకులాక్షరమ్|
స రాజా పునరేవైతాన్ ఇదం వచనమబ్రవీత్ ||

స|| క్రోథ పర్యాకులాక్షరం తేషామ్ తద్వచనం శ్రుత్వా స రాజా పునః ఏతాన్ వచనం అబ్రవీత్ ||

తా|| క్రోధావేశములతో పలికిన వారి మాటలను విని ఆ రాజు మళ్ళీ ఈ వచనములను పలికెను.

ప్రత్యాఖ్యాతోస్మి గురుణా గురుపుత్రైః తథైవ చ |
అన్యాం గతిం గమిష్యామి స్వస్తి వో అస్తు తపోధనాః ||

స|| హే తపోధనాః ! ప్రత్యాఖ్యాతోస్మి గురుణా తథైవ గురుపుత్రైః చ | అన్యాం గతిం గమిష్యామి | స్వస్తి వో అస్తు||

తా|| ఓ తపోధనులారా ! గురువు చేతనూ అలాగే గురుపుత్రులచేతనూ నేను తిరస్కరింపబడితిని. ఇంకో మార్గము చూచుటకు పోయెదను. మీకు శుభమగుగాక.

ఋషిపుత్త్రాస్తు తత్ శ్రుత్వా వాక్యం ఘోరాభిసంహితమ్ |
శేపుః పరమసంక్రుద్ధాః చండాలత్వం గమిష్యసి |
ఏవముక్త్వా మహాత్మానో వివిశుస్తే స్వమాశ్రమమ్ ||

స|| తత్ర ఘోరాభి సంహితం తత్ వాక్యం శ్రుత్వా ఋషిపుత్త్రాః తు పరమ సంక్రుద్ధాః చండాలత్వం గమిష్యసి ఇతి శేపుః | మహాత్మానో ఏవం ఉక్త్వా స్వం ఆశ్రమం వివిశిస్తే |

తా|| అట్టి ఘోరమైన వచనములను విని ఋషిపుత్రులు పరమ క్రోధముతో నీవు చండాలత్వము పొందెదవు గాక అని శపించితిరి | ఆ మహాత్ములు ఈ విథముగా చెప్పి తమ ఆశ్రమము నకు పోయిరి |

అథ రాత్ర్యాం వ్యతీతాయాం రాజా చండాలతాం గతః |
నీలవస్త్ర ధరో నీలః పరుషో ధ్వస్తమూర్థజః ||
చిత్యమాల్యాను లేపశ్చ ఆయసాభరణో అభవత్ ||

స|| అథ రాత్ర్యాం వ్యతీతాయాం రాజా హండాలతాం గతః | నీలవస్త్రధరం నీలః అభవత్ | పరుషో ధ్వస్త మూర్థజః చిత్యమాల్యాను లేపశ్చ అయసాభరనో అభవత్ |

తా|| పిమ్మట రాత్రి గడిచినంతనే రాజు చండాలత్వము పొందెను. నల్లని వస్త్రములు కలవాడాయెను. నల్లని రంగు కలవాడాయెను. కఱకు దనము కలవాడాయెను, చిన్న వెంట్రుకలు కలవాడాయెను. చితి మాలలూ శ్మశాన బూడిద కలవాడాయెను. అతని ఆభరణములు ఇనుముతో చేసినవి అయ్యెను.

తం దృష్ట్వా మంత్రిణస్సర్వే త్యజ చండాలరూపిణమ్ |
ప్రాద్రవన్ సహితా రామ పౌరా యేsస్యానుగామినః||

స|| హే రామ ! తం చండాలరూపిణమ్ దృష్ట్వా మంత్రిణః సర్వే ప్రా ద్రవన్ " పౌరాః అస్య అనుగామినః |

తా|| ఓ రామా ! అ చండాల రూపముగల వానిని చూచి మంత్రులందరూ పారిపోయిరి. పౌరులు వారిని అనుసరించితిరి.

ఏకోహి రాజా కాకుత్‍స్థ జగామ పరమాత్మవాన్ |
దహ్యమానో దివారాత్రం విశ్వామిత్రం తపోధనమ్ ||

స|| హే కాకుత్‍స్థ ! రాజా ఏకో హి దహ్యమానః దివారాత్రం జగామ పరమాత్మవాన్ విశ్వామిత్రం తపోధనమ్ ||

తా|| ఓ కకుత్‍స్థ ! ఆ రాజు ఒంటరివాడై రాత్రి పగలు దుఃఖముతో మండిపోవుచున్ననూ ధైర్యముతో తపోధనుడు అగు విశ్వామిత్రుని వద్దకు వెళ్ళెను.

విశ్వామిత్రస్తు తం దృష్ట్వా రాజానం విఫలీకృతమ్ |
చండాలరూపిణం రామ మునిః కారుణ్యమాగతః ||

స|| విశ్వామిత్రః తు తం విఫలీకృతం చండాలరూపిణం రాజానం దృష్ట్వా మునిః కారుణ్యమాగతః ||
తా|| ఆ అసఫలుడైన చండాలరూపము పొందిన రాజుని చూచి విశ్వామిత్ర ముని కి కరుణ కలిగెను.

కారుణ్యాత్ స మహాతేజా వాక్యం పరమధార్మికః |
ఇదం జగాద భద్రం తే రాజానం ఘోర రూపిణమ్ ||

స|| కారుణ్యాత్ సః పరమధార్మికః మహాతేజా ఘోరరూపిణం రాజానం ఇదం జగాద భద్రం తే |

తా|| ఆ కరుణతో పరమధార్మికుడు మహాతేజోవంతుడు అయిన విశ్వామిత్రుడు ఆ ఘోరరూపముగల రాజు తో ఇట్లనెను.

కిమాగమన కార్యం తే రాజపుత్త్ర మహాబల |
అయోధ్యాధిపతే వీర శాపాత్ చండాలతాం గతః ||

స|| హే మహాబల ! ఆగమన కార్యం కిం | హే రాజపుత్త్ర !హే అయోధ్యాధిపతే హే వీర శాపాత్ తే చండాలతాం గతః ||

తా|| ఓ మహాబల ! నీవు వచ్చిన పని ఏమి ? ఓ రాజపుత్ర ! ఓ అయోధ్యాధిపతి ! ఓ వీరా శాపముతో నీకు చండాలగతి ( ఎవరివలన) పట్టినది)

అథ తద్వాక్య మాజ్ఞాయ రాజా చండాలతాం గతః |
అబ్రవీత్ ప్రాంజలిర్వాక్యం వాక్యజ్ఞో వాక్య కోవిదమ్ ||

స|| అథ తత్ వాక్యం ఆజ్ఞాయ చండాలతాం గతః (స) రాజా ప్రాంజలిః వాక్యజ్ఞో వాక్య కోవిదమ్ (ఇదం) అబ్రవీత్ |

తా|| అప్పుడు ఆ మాటలను విని వాక్యజ్ఞుడు అయిన ఆ రాజు వాక్యకోవిదుడు అయిన రాజర్షికి అంజలిఘటించి చండాలత్వము పొందిన కారణము ఇట్లు చెప్పెను.

ప్రత్యాఖ్యాతోస్మి గురుణా గురుపుత్త్రైః తథైవ చ|
అనవాప్యైవ తం కామం మయా ప్రాప్తో విపర్యయః ||

స|| గురుణా తథైవ గురుపుత్త్రైః పత్యాఖ్యాతః అస్మి | తం వాక్యం అనవాప్యఏవ మయా విపర్యయః ప్రాప్తః ||

తా|| గురువు చేత అలాగే గురుపుత్రులచేత తిరస్కరింపబడినవాడిని అయితిని. నాకోరిక పొందనప్పటికీ నాకు శాపము కలిగినది.

సశరీరో దివం యాయా మ్ ఇతి మే సౌమ్య దర్శనమ్ |
మయా చేష్ఠం క్రతుశతం తత్ చ న అవాప్యతే ఫలమ్||

స|| హే సౌమ్య సశరీరో దివం యాయామ్ ఇతి మయా చేష్ఠం శతం క్రతుం తత్ చ ఫలం న అవాప్యతే ||

తా|| ఓ సౌమ్యుడా ! శరీరముతో దేవలోకము పోవుటకు అని నేను వంద క్రతువులు చేసితిని. వాని ఫలముకూడా నాకు దక్కలేదు.

అనృతం నోక్త పూర్వం మే న చ వక్ష్యే కదాచన |
కృఛ్ఛేష్వపి గత స్సౌమ్య క్షత్ర ధర్మేణ తే శపే ||
యజ్ఞైః బహువిధైరిష్టం ప్రజా ధర్మేణ పాలితాః |
గురవశ్చ మహాత్మానః శీలవృత్తేన తోషితాః ||

స|| హే సౌమ్య ! క్షత్ర ధర్మేణ తే శపే | మే పూర్వం అనృతం కృచ్చేష్వపి న ఉక్తం | న వక్ష్యే కదాచన | బహువిధైః యజ్ఞైః ఇష్టం | ధర్మేణ ప్రజా పాలితాః | మాహాత్మనా గురవః చ శీలవృత్తేన తోశితాః ||

తా|| ఓ సౌమ్య ! నా క్షత్ర ధర్మముపై నీకు ప్రమాణము చేసి చెప్పుచున్నాను. నేను పూర్వము అబద్దము ఎంత కష్టమైననూ చెప్పలేదు. నేను ఎప్పుడూ చెప్పను కూడా. అనేక యజ్ఞములను చేసితిని. ధర్మముగా ప్రజలను పాలించితిని. మహాత్ములగు గురువులచే నా శీలవృత్తి అభినందించబడినది.

ధర్మే ప్రయతమానస్య యజ్ఞం చాహర్తుమిచ్ఛతః |
పరితోషం న గచ్చంతి గురవో మునిపుంగవః ||

స|| ధర్మే ప్రయతమానస్య ( అహం) యజ్ఞం ఆహర్తుం ఇఛ్ఛతః చ| మునిపుంగవః గురవః పరితోషం న గచ్చంతి |

తా|| ధర్మమార్గములో పోవుచూ ఈ యజ్ఞము చేయ కోరుచున్నాను. గురువు అయిన మునిపుంగవులు దానికి సంతోషము వ్యక్త పరచలేదు.

దైవమేవ పరం మన్యే పౌరుషం తు నిరర్థకమ్|
దైవేనాక్రమ్యతే సర్వం దైవం హి పరమాగతిః ||

స|| దైవం ఏవ పరం మన్యే | పౌరుషం నిరర్థకమ్ తు | దైవేనాక్రమ్యతే సర్వం| దైవం హి పరమాగతిః ||

తా|| దేముడు తప్ప ఇంకో మార్గము లేదు. పౌరుషబలము నిరర్థకము. దేముడే అన్నిటికి అధిపతి. దైవమే పరమాగతి .

తస్యమే పరమార్తస్య ప్రసాదం అభికాంక్షితః |
కర్తుమర్హసి భద్రం తే దైవోపహత కర్మణః ||

స|| మే పరమఆర్తస్య దైవోపహత కర్మణః అభికాంక్షితః తస్య కర్తుం అర్హసి | భద్రం తే |

తా|| మిక్కిలి ఆర్తుడనగు నాకు దైవము అనుకూలమగునట్లు చేయగల కర్మ నీవు చేయగలవు. నీకు శుభమగుగాక .

నాన్యాం గతిం గమిష్యామి నాన్యశ్శరణమస్తి మే|
దైవం పురుషకారేణ నివర్తయితుమర్హసి ||

స|| న అన్యం గతిం గమిష్యామి | న అన్యః శరణమ్ అస్తి | పురుషకారేణ దైవం నివర్తయితుమర్హసి ||

తా|| నాకు అన్యమైన గతి లేదు | నాకు ఇంకొకరి శరణు లేదు. పురుషకార్యముతో దైవమును అనుకూలముగా మీరే చేయగలరు.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే అష్టపంచాశస్సర్గః ||
|| ఈ విథముగా వాల్మీకి ఆదికావ్యమైన శ్రీమద్రామాయణములో బాలకాండలో ఎబది ఎనినిదవ సర్గ సమాప్తము ||

|| ఓమ్ తత్ సత్ ||

|| om tat sat ||